Kukrail Forest: భారత్‌లోనే తొలి నైట్ సఫారీ 7 d ago

పర్యాటకులకు పగటిపూట వన్యప్రాణుల సఫారీ చేస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతిని రాత్రిసమయాల్లో వన్యప్రాణులు, ముఖ్యంగా నిశాచర జీవులను వాటి సహజ ఆవాసంలో అందించేందుకు 'కుక్టైల్ నైట్ సఫారీ, అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా పార్క్ ను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా రూ.1,500 కోట్లతో రెండు దశల్లో లఖ్నవూలోని కుక్టైల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనుంది.
ప్రఖ్యాత 'సింగపూర్ నైట్ సఫారీ' స్ఫూర్తితో యూపీ ప్రభుత్వం 850కుపైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. రూ.631 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తొలి దశ పనుల్లో భాగంగా నైట్ సఫారీ, అడ్వెంచర్ పార్క్క అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఎన్ క్లోజర్ల ఏర్పాటు, పర్యాటకులకు సౌకర్యాలు వంటివాటిపై దృష్టి సారించనున్నారు. 24 నెలల్లో పూర్తికానుంది.
సహజమైన చీకటి వాతావరణం నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు, పర్యావరణహితమైన ఈవీ వాహనాలు, పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు, వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు సమాచార కేంద్రాలు, సఫారీ థీమ్ వసతి సౌకర్యాలు, ట్రామ్ సర్వీసు వంటివి కల్పించనున్నారు. కుక్టైల్ ఫారెస్ట్ లో 34.59 లక్షల చదరపు మీటర్లు (855.07 ఎకరాలు) మేర ఏర్పాటు చేయనున్న ఈ నైట్ సఫారీలో సింహాలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు మరియు వివిధ సరీసృపాలు మరియు పక్షులు వంటి విభిన్న జాతులకు నిలయంగా ఉండే 38 జంతు ఎన్ క్లోజర్లు ఉంటాయి.